నేడే 5 రాష్ట్రాల ప్రజాతీర్పు... ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్దం

తెలంగాణతో సహా 5 రాష్ట్రాల ప్రజల తీర్పు నేడే వెలువడబోతోంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. 5 రాష్ట్రాలలో ఎన్నికల సంఘాలు ఓట్ల లెక్కింపుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారులు, పార్టీల ఏజంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొంటున్నారు. తెలంగాణలో మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

తెలంగాణలో భద్రాచలం, అశ్వారావు పేట నియోజకవర్గాలలో కౌంటింగ్ రౌండ్స్ తక్కువగా ఉన్నందున ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తయి ముందుగా ఫలితాలు వెలువడనునయి. అలాగే ఛార్మినార్ నియోజకవర్గంలో అతి తక్కువ ఓటింగ్ నమోదు అయినందున దాని ఫలితాలు ముందుగా వెలువడే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలలోగా ఈ మూడు నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 

బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలోకి ప్రవేశించి లోపల భద్రపరిచిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలను తెరిచి చూశారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిన్న ధర్నా చేశాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.