రేపు (ఆదివారం) తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీయే గెలిచి అధికారంలోకి వస్తుందని సిఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తునప్పటికీ, ఓటమి ఖాయం అని ఆయనకు తెలుసని అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఫిరాయింపజేసుకొనేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారని కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ ఆరోపించారు.
నేడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే ముందు అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి రాబోతోంది. ఓటమి అంచున ఉన్న కేసీఆర్, మా పార్టీ ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడుతూ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ఆటలు ఇక సాగవు. ఆయనకు భయపడి మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వేరే చోటికి తరలించాల్సిన అవసరం కూడా లేదు. రేపు ఉదయం మేమందరం హైదరాబాద్‌లో తాజ్ కృష్ణలో సమావేశం కాబోతున్నాము. గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఎన్నికల అధికారుల వద్దకు వెళ్ళి ప్రమాణపత్రాలు తీసుకొంటారు,” అని చెప్పారు.