ప్రొఫెసర్ కోదండరామ్‌ ముందే హెచ్చరిక

ఈసారి ఎన్నికలలో తెలంగాణ జనసమితి పోటీ చేయకుండా విరమించుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. కనుక కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ తప్పకుండా ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించనున్నారు. 

కానీ కేసీఆర్‌ అంత సులువుగా ఓటమిని అంగీకరించరు కనుక ఆయన తప్పకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తారని కాంగ్రెస్‌ పార్టీ, ప్రొఫెసర్ కోదండరామ్‌ కూడా గట్టిగా నమ్ముతున్నారు. 

కనుక ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఎన్నో ఏళ్ళ పోరాటాలు, ఎందరో బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్యబద్దంగా పనిచేసే ప్రభుత్వం ఏర్పడబోతోంది. ప్రజల ఆకాంక్షల మేర పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కనుకనే మేము కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి కాంగ్రెస్‌ని గెలిపించుకొనేందుకు గట్టిగా కృషి చేశాము. 

అయితే రేపు గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరైనా ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయిస్తే చూస్తూ ఊరుకోము. ప్రజలతో కలిసి వారి ఇళ్ళ ముందు ధర్నాలు చేసి గట్టిగా నిలదీస్తాము. అటువంటి పరిస్థితి రాకూడదనే కోరుకొంటున్నాము,” అని అన్నారు.