డిసెంబర్‌ 3 తర్వాత కేసీఆర్‌ ఏమి చేస్తారు?

రేపు (ఆదివారం) ఈపాటికి బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలలో ఏది గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందో దాదాపు స్పష్టమైపోవచ్చు. 

ఒకవేళ సర్వేలు సూచిస్తున్నట్లు కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి వస్తే కేసీఆర్‌, బిఆర్ఎస్ నేతలందరూ ఏం చేస్తారు? అనే ప్రశ్న వినబడుతోంది. 

కేసీఆర్‌ ఓడిపోతే చేతులు ముడుచుకొని కూర్చోనే వ్యక్తి కారు. కనుక ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో కొట్లాటలు మొదలైతే దానిని అనుకూలంగా మలుచుకొనేందుకు ప్రయత్నించడం ఖాయం.     

ఒకవేళ అది సాధ్యం కాకపోయినా త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్దం చేసుకొంటారు. తెలంగాణలో పదవి, అధికారం కోల్పోయి పొరుగు రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడం చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్‌ ఎక్కువ ఎంపీ సీట్లు కూడగట్టగలిగితే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పవచ్చు. అప్పుడు తెలంగాణ రాజకీయాలను మరో దిశగా నడిపించేందుకు ప్రయత్నించవచ్చు. 

కనుక ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ ఓడినా, గెలిచినా కేసీఆర్‌ తదుపరి లక్ష్యం ఏపీ, మహారాష్ట్రలతో సహా కాస్త అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో బిఆర్ఎస్ పార్టీని లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయించడం. లేదా కలిసివచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఎన్నికల తర్వాత వాటన్నిటినీ తన నాయకత్వంలో ఒక్కతాటిపై తీసుకువచ్చేందుకు కేసీఆర్‌ గట్టిగా ప్రయత్నించవచ్చు. 

ఒకవేళ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ గెలిచి కేసీఆర్‌ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎప్పటిలాగే ఆయన ప్రభుత్వం సాగిపోతుంటుంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ వలన కలిగిన నష్టాన్ని చవిచూశారు కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సమూలంగా నిర్వీర్యం చేయక మానరు. 

కేసీఆర్‌కు మరో 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించే అవకాశం లభిస్తే అంత సుదీర్గ కాలం కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం వలన నష్టమే తప్ప లాభం ఉండదు. కనుక ప్రధాని నరేంద్రమోడీతో మళ్ళీ సఖ్యతకు ప్రయత్నించవచ్చు. లేదా లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కేసీఆర్‌ దానిలో చేరినా ఆశ్చర్యం లేదు.