మరో 12 అడుగులు ఆ తర్వాత డెడ్ స్టోరేజ్!

నాగార్జున సాగర్ డ్యామ్‌ నీటి వాడకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య అకస్మాత్తుగా పోలింగ్ ముందు రోజు వివాదం మొదలైంది. ఏపీ సిఎం జగన్‌ ఆదేశం మేరకు ఆ రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు, పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి తెలంగాణ నిర్వహణలో ఉన్న 13వ గేటు వరకు కంచెలు ఏర్పాటు చేసి, దిగువకు నీళ్ళు విడుదల చేసుకొంటున్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ పోలీసులను, అధికారులను బలవంతంగా అక్కడి నుంచి పంపించివేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల పోలీసుల మద్య తోపులాట జరిగింది. 

తెలంగాణలో పోలింగ్‌ జరుగుతున్నప్పుడు హటాత్తుగా ఏపీ ప్రభుత్వం ఈవిదంగా వ్యవహరించడంపై, కాంగ్రెస్‌, బీజేపీలు భిన్నంగా స్పందించాయి. కేసీఆర్‌ ఎన్నికలలో ఓడిపోబోతున్నానని గ్రహించే, ఏపీ సిఎం జగన్‌తో కలిసి ఈ కొత్త డ్రామా ఆడించి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని ప్రయత్నించారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణలో పోలింగ్‌ విధులు పూర్తి కాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వందాలది మంది పోలీసులను నాగార్జున సాగర్ డ్యామ్‌ వద్దకు పంపించింది. గురువారం రాత్రి అంతా ఇరు రాష్ట్రాల పోలీసులు డ్యామ్‌పై ఎదురెదురుగా నిలిచి ఉండటంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. 

డ్యామ్‌పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉండగానే మరోవైపు ఏపీ అధికారులు డ్యామ్‌ కుడివైపు శ్రీశైలం వైపు గల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసుకొంటున్నారు. ఇప్పటివరకు 4,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఇంకా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉంది. మరో 12 అడుగులు నీటి మట్టం తగ్గితే ‘డెడ్ స్టోరేజ్’కి చేరుకొంటుంది. ఈరోజు రెండు రాష్ట్రాల ఐజీ స్థాయి అధికారులు అక్కడకు చేరుకొని స్వయంగా పరిస్థితిని సమీక్షించనున్నారు.