బిజెపి ఓటమిని కిషన్‌రెడ్డి అంగీకరించేసినట్లే?

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఈసారి కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలలో ఏదో ఓ పార్టీ గెలుస్తుందని ఇప్పటికే ఖాయమైపోయింది. అన్ని సర్వేలు బీజేపీ మజ్లీస్‌ తర్వాత నాలుగో స్థానానికి పరిమితం కాబోతోందని మొదటి నుంచే చెపుతున్నాయి. నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కూడా మరోసారి అదే చెప్పాయి. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవిలో నుంచి తొలగించుకోవడంతోనే బీజేపీ ఓటమి ఖాయం అయిపోయిందని చెప్పవచ్చు. కనుక బీజేపీ ఓటమికి ఎవరినో నిందించాల్సిన అవసరం లేదనే చెప్పాలి. కానీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలను, ఎన్నికల సంఘాన్ని నిందించారు.    

నిన్న సాయంత్రం పోలింగ్ పూర్తయిన తర్వాత కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి శాసనసభ ఎన్నికలలో మంచి ఫలితాలను ఆశిస్తున్నాము. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అంకితభావంతో పనిచేస్తాము. కాంగ్రెస్‌, బిఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బు పంచిపెడుతుంటే ఎన్నికల సంఘం చూసి చూడన్నట్లు ఊరుకొంది. 

బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొనేందుకు చివరి నిమిషం వరకు కేసీఆర్‌, కేటీఆర్‌ రకరకాలుగా ప్రయత్నించారు. పోలింగ్‌ ముందు రోజు దీక్షా దివస్ పేరుతో డ్రామాలు, నాగార్జున్ సాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ పోలీసుల ఘర్షణలతో తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. సాగర్ వద్ద ఆడిన కేసీఆర్‌ ఆడించిన ఈ డ్రామాకు ఏపీ పోలీసులను కూడా పంపించి జగన్‌ ప్రభుత్వం తోడ్పడింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసే ఈ డ్రామా ఆడారని మేము భావిస్తున్నాము.            

బిఆర్ఎస్ పార్టీతో బీజేపీకి రహస్య అవగాహన ఉందంటూ కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేసింది. వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తమ తమ రాష్ట్రాల పనుల కోసం ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తుంటారు. అంతమాత్రన్న వారందరితో బీజేపీ కుమ్మక్కు అయ్యిందని చెప్పడం సరికాదు. 

ఈ ఎన్నికలలో బీజేపీని గెలిపించేందుకు రేయింబవళ్ళు అంకితభావంతో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు,” అని కిషన్ రెడ్డి అన్నారు.