
గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు సర్వేలన్నీ తేల్చి చెప్పేశాయి. అయితే ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుందనేది డిసెంబర్ 3న తెలుస్తుంది.
ఈసారి బిఆర్ఎస్ పార్టీకి 25 సీట్లకు మించి రావు. ఓటమి భయం అప్పుడే కేసీఆర్, కేటీఆర్‌లో కనిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండా ప్రగతి భవన్‌లోనే ఉండిపోయారు. బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పిన సర్వే సంస్థలను కేటీఆర్ బెదిరిస్తున్నారు. అందుకు క్షమాపణ చెప్పాలని కోరుతున్న కేటీఆర్, ఎగ్జిట్ పోల్స్ నిజమైతే వాటికి క్షమాపణ చెపుతారా?
రాజకీయంగా చాలా చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు అహంభావంతో విర్రవీగుతున్న కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజానీకం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కనుక కేసీఆర్ కారణంగానే బిఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతోంది. తరతరాలపాటు తమ కుటుంబమే అధికారంలో కొనసాగాలని కేసీఆర్ అనుకొన్నారు. కానీ ఆయన వలన నష్టపోయిన రైతులు, నిరుద్యోగయువతే ఆయనను గద్దె దించుతున్నారు.
కేసీఆర్ ప్రజలను, ప్రతిపక్షాలను బానిసలుగా భావించారు. కానీ మనం ప్రజలకు సేవకులుగా చాలా బాధ్యతగా మెసులుకొంటూ చక్కటి పరిపాలన అందిదాము. కేసీఆర్‌లా కాకుండా కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించి తక్షణమే అమలు చేసేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఇంతకాలం రాష్ట్రంలో కొనసాగిన ఆధిపత్య ధోరణికి స్వస్తి పలికి సమాజంలో అందరినీ కలుపుకుపోతాము.
కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అయ్యింది కనుక పార్టీలో అందరూ కూడా ఇకపై ఆచితూచి మాట్లాడాలని పిసిసి అధ్యక్షుడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎంపీ, ఎమ్మెల్యే పదవులలో దేనిలో కొనసాగాలో కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుంది. దాని నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను,” అని రేవంత్ రెడ్డి అన్నారు.