హైదరాబాద్‌లో దాదాపు అందరూ విద్యావంతులే.. వారిలో ఉన్నత విద్యావంతులు, ఐటి ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు నిరసనగా హైటెక్ సిటీ వద్ద ధర్నా కూడా చేశారు. కానీ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైనా, ఇంతవరకు చాలామంది ఓట్లు వేసేందుకు రానేలేదు.
హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాలలో సినీ రాజకీయ ప్రముఖులు, సామాన్య మద్యతరగతి ప్రజలు, గ్రామీణులు, వృద్ధులు, వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేసి వెళుతున్నారు.
కానీ ఎప్పటిలాగే హైదరాబాద్ నగరంలో మాత్రం ఇంకా చాలా మంది ఓట్లు వేసేందుకు రానేలేదు. అందుకే ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో అతి తక్కువ 12.93 శాతం పోలింగ్ నమోదయ్యింది. తెలంగాణలో కాస్త వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 25.80% పోలింగ్ పూర్తయింది.
హైదరాబాద్‌లో నాంపల్లిలో ఉదయం 11 గంటలకు కేవలం 5% పోలింగ్ జరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈసారి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశాయి. కానీ అక్కడ ఉదయం 11 గంటలకు కేవలం 10% పోలింగ్ జరిగింది. అలాగే ముషీరాబాద్, ఛార్మినార్ నియోజకవర్గాలలో 10% మాత్రమే నమోదైంది.
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందిస్తూ, “ఈ ధోరణి మంచి కాదు. హైదరాబాద్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించువడానికి అందరూ తరలిరావాలి,” అని విజ్ఞప్తి చేశారు.