టాలీవుడ్‌ సెలబ్రేటీలే ముందుగా ఓట్లు వేశారే

ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ మొదలవగా హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖులే ముందుగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు.

సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, అల్లు అర్జున్‌, వెంకటేష్, జూ.ఎన్టీఆర్‌, శివాజీ రాజా, దర్శకులు కె.రాఘవేంద్రరావు, తేజ, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు.

రాజకీయ ప్రముఖులలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ క్రికెటర్ అజహారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఓట్లు వేశారు.

డిజిపి అంజనీ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్, తెలంగాణ సిఐడీ చీఫ్ మహేష్‌ బాబు భగవత్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. 

రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతున్నప్పటికీ పలు నియోజకవర్గాలలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్‌ ఆలస్యం అవుతోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 117, జూబ్లీహిల్స్‌లోని 153, నాగార్జున సాగర్‌లోని 103వ పోలింగ్‌ బూత్‌లు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. 

బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకొన్న కల్వకుంట్ల కవిత అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇదిగో నేను నా ఓటు హక్కుని వినియోగించుకొన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ముఖ్యంగా మహిళలు, యువత తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు తరలి రావాలి. ఢిల్లీ నుంచి వచ్చినవారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. కనుక అభివృద్ధి కోసం కేసీఆర్‌ని మళ్ళీ గెలిపించండి,” అని అన్నారు. 

ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత పోలింగ్‌ బూత్‌ వద్ద కల్వకుంట్ల కవిత ఈవిదంగా ప్రచారం చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే కనుక ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.