ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. మొన్నటివరకు ఎన్నికల ప్రచారంతో క్షణం తీరిక లేకుండా గడిపిన అన్ని పార్టీల నాయకులు, అభ్యర్ధులలో తీవ్ర ఆందోళనతో ఉన్నారు. కొందరు గుళ్ళు గోపురాలకు తిరుగుతూ ప్రత్యేక పూజలు చేస్తుంటే, మరికొందరు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. అప్పటి వరకు క్యూ లైన్లలో ఉన్నవారందరికీ ఎంత ఆలస్యమైన ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. పోలింగ్ పూర్తయిన అర్ధగంట తర్వాత వివిద మీడియా, సర్వే సంస్థలు తమ నివేదికలు ప్రకటించనున్నాయి. ఇంతవరకు అవి ప్రకటించిన నివేదికలు ఒక ఎత్తు, ఈరోజు సాయంత్రం ప్రకటించబోయేవి మరో ఎత్తు అని చెప్పవచ్చు. కనుక ఈసారి ఎన్నికలలో ఏ పార్టీ గెలవబోతోందో సాయంత్రానికి కొంత స్పష్టత రావచ్చు.
శాసనసభలో మొత్తం 119 స్థానాలున్నందున ప్రభుత్వ ఏర్పాటుకి కనీసం 60 స్థానాలు గెలుచుకోవలసి ఉంటుంది. బిఆర్ఎస్ పార్టీ మొత్తం 119 స్థానాలకు పోటీ చేయగా, దానికి ఈసారి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 118 స్థానాలకు పోటీ చేసి సీపీఐకి ఒక స్థానం కేటాయించింది. బీజేపీ 119 స్థానాలలో 8 స్థానాలను జనసేనకు కేటాయించి మిగిలిన 111 స్థానాలలో పోటీ చేసింది. బీఎస్పీ 107, సీపీఎం: 19, మజ్లీస్ 7 స్థానాలలో పోటీ చేసాయి.
హైదరాబాద్ ఎల్బీ నగర్లో అత్యధికంగా 48 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా, బాన్సువాడ, నారాయణ పేట నియోజకవర్గాలలో అతి తక్కువగా ఏడుగురు చొప్పున పోటీ చేశారు.
రాష్ట్రంలో 55 నియోజకవర్గాలలో ఒక్కోటి, 54 నియోజకవర్గాలలో 2 ఈవీఎంలను, 10 నియోజకవర్గాలలో 3 ఈవీఎంలను ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు.