తెలంగాణలో పోలింగ్‌ ప్రారంభం

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చేసింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. అనేక నియోజకవర్గాలలో ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టడం చూస్తే, ప్రజలు కూడా ఈరోజు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్దమవుతుంది. పోలింగ్‌ మొదలవగానే కూకట్‌పల్లి బిఆర్ఎస్ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు సతీసమేతంగా వచ్చి పోలింగ్‌ బూత్ నంబర్: 12లో ఓట్లు వేశారు. 

పోలింగ్‌ ప్రారంభమైన కొద్ది సేపటికే కొన్ని నియోజకవర్గాలలో ఈవీఎంలు మొరాయించడంతో వాటిని సరిచేసి మళ్ళీ పోలింగ్‌ ప్రారంభించారు. నిజామాబాద్‌ ఆదర్శ పోలింగ్‌ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొంతసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. 

రాష్ట్రంలో అత్యధికంగా 7,32,560 మంది ఓటర్లున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 638 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అతి తక్కువ మంది (1,48,713) ఓటర్లున్న భద్రాచలం నియోజకవర్గంలో 176 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.