ఎన్నికలకు ముందు స్మితా సభర్వాల్‌కు నీటిపారుదల శాఖ!

రేపు తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. పైగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉంది. ఇటువంటి సమయంలో సిఎం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్‌ను సాగునీటి శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మరో 5 రోజులలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నప్పుడు, ఈ నియామకాలు చేపట్టడం ఆశ్చర్యంగానే ఉంది. 

ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న రజత్‌ కుమార్‌ రేపు (30వ తేదీ)న పదవీ విరమణ చేయబోతున్నందున ఆ అదనపు బాధ్యతను కూడా స్మితా సభర్వాల్‌కు ప్రభుత్వం అప్పగించింది. దీంతో పాటు ఆమెను భూసేకరణ, పునరావాసం విభాగం డైరెక్టర్‌గా కూడా ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ తాజా నియామకాలకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. కానీ తీసుకోకుండా నియామకాలు చేపడితేనే సమస్య మొదలవుతుంది.