గెలిపిస్తే విజయయాత్ర... ఒడిస్తే శవయాత్ర: పాడి కౌశిక్

హుజూరాబాద్‌ బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఎన్నికల ప్రచారం ముగింపు రోజున నియోజకవర్గంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మీరు నన్ను గెలిపిస్తే డిసెంబర్‌ 4వ తేదీన విజయయాత్రలో అందరం కలుద్దాము. మీరు నన్ను ఓడగొడితే నేను, నా భార్య, కూతురు ముగ్గురం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంటాము. అప్పుడు మీరందరూ మా శవయాత్రలో పాల్గొంటారు,” అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. 

దీనిపై కాంగ్రెస్‌ అనుబంధ ఎన్ఎస్‌యుఐ (విద్యార్ధి) సంఘం అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజలు తనకు ఓట్లు వేసి గెలిపించకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకొంటామంటూ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రజలను ఇమ్మోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నించారని, ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమే కనుక ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ కోరారు. దీనికి సంబందించి న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తల క్లిపీంగ్స్, యూట్యూబ్‌లో వచ్చిన వీడియోల లింక్స్ కూడా ఫిర్యాదుతో జత చేసారు. 

చట్టప్రకారం ఆత్మహత్య చేసుకోవాలనుకోవడమే నేరం. అలాంటిది ఎమ్మెల్సీ హోదాలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి, తనను ఎన్నికలలో గెలిపించకపోతే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకొంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పడం ఇంకా పెద్ద నేరమే అవుతుంది. కానీ అధికార పార్టీకి చెందిన ఆయనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకొంటుందా?అసలు బల్మూరి లేఖను పట్టించుకొంటుందా? ఏమో!