తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్దం

రేపు జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాలు మినహా మిగిలిన 106 నియోజకవర్గాలలో  రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగబోతోంది. 

మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి. మంచిర్యాల, ఆసిఫాబాద్, మంధాని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం 13 నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అప్పటికి క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు అనుమతిస్తారు. 

 శాసనసభలో 119 స్థానాలకు మొత్తం 2,290 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో 221 మంది మహిళలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. 

రాష్ట్రంలో మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు  1,62,92, 048 మంది కాగా స్త్రీలు 1,63,17,005మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676 మంది ఉన్నారు.

వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36, 655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ప్రతీ నియోజకవర్గంలో కేవలం మహిళల కొరకు 5 పోలింగ్ కేంద్రాలు, 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగుల కొరకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. 

రాష్ట్రంలో 12,000 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి ఎన్నికల సంఘం అదనపు భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కర్ఫ్యూ విధించింది. రేపు సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 

రేపటి పోలింగ్‌ కోసం 375 కంపెనీల కేంద్ర బలగాలు, 50,000 మంది రాష్ట్ర పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 60,000 ఈవీఎంలను వినియోగించబోతోంది. అదనంగా మరో 14,000 ఈవీఎంలను సిద్దంగా ఉంచింది.  ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది పోలీసుల భద్రత మద్య ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరుతున్నారు.