మోడీ సభలో కొత్తగా ఏం చెప్పారు?

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం తుఫ్రాన్, నిర్మల్ పట్టణాలలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగా ఏం చెప్పరంటే ఏమీ లేదనే చెప్పవచ్చు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ ఆస్తులు పోగేసుకొంటుండగా, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలవుతోందని, ప్రజలు మరింత పేదవారవుతున్నారని మోడీ ఆరోపించారు. ఆ అవినీతి సొమ్ముతోనే కేసీఆర్‌ జాతీయరాజకీయాలు చేసేందుకు బయలుదేరి ఢిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వంతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ చేశారని, దానిపై విచారణ సాగుతోందని, ఏదో రోజు నిందితులు జైలుకి వెళ్ళక తప్పదని ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. 

కేసీఆర్‌ ప్రజల గురించి కాక తన కొడుకు కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేయడం ఎలా అనే ఎక్కువ ఆలోచిస్తుంటారని, ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఫామ్ హౌసులో ఉంటూ రాజకీయాలు చేస్తుంటారని ఆరోపించారు. కేసీఆర్‌ తన కోసంఫామ్ హౌసు కట్టుకొన్నారని కానీ, కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో పేదలకు ఇళ్ళు కట్టించాలనుకొంటే కేసీఆర్‌ అడ్డుకొన్నారని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. 

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌ ఇప్పుడు తన కొడుకుని ముఖ్యమంత్రి చేసేందుకు తహతహలాడుతున్నారని అన్నారు. అయితే ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి రాష్ట్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మంత్రివర్గంలో బీసీలతో సహా అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.