కొడంగల్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గం పరిధిలోని బొంరాస్ పేటలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల మద్య ఘర్షణ జరిగింది. అక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ నేత ఫసియుద్దీన్‌పై కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మద్య ఘర్షణ మొదలైంది. దాంతో పరస్పరం దాడులు చేసుకొన్నారు. పోలీసులు వారిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఈ దాడులలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. 

అంతకు ముందు నియోజకవర్గం పరిధిలోని కోస్గీలో కూడా కాంగ్రెస్‌, బిఆర్ఎస్ శ్రేణుల మద్య దాడులు జరిగాయి. అక్కడ బిఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి కుమారుడు హితేష్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మద్య ఘర్షణలు జరిగాయి. 

ఈసారి రేవంత్‌ రెడ్డిని కామారెడ్డి, కొడంగల్‌ రెండు చోట్ల ఓడించాలని బిఆర్ఎస్ పార్టీ చాలా పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఈసారి కామారెడ్డిలో కేసీఆర్‌ని ఓడించాలని, కొడంగల్‌లో కూడా గెలవాలని రేవంత్‌ రెడ్డి కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక ఇరువర్గాల మద్య రెండు నియోజకవర్గాలలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.