కామారెడ్డి ప్రజలకు మాత్రమే ఈ అవకాశం: ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ నేడు కామారెడ్డిలో ఎన్నికల సభలో పాల్గొని కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలపై సునిశిత విమర్శలు చేశారు. “ఈ రెండూ కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు. వారిద్దరూ (కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి) తమ తమ నియోజకవర్గాలలో ఓడిపోతామనే భయంతోనే ఇక్కడకు వచ్చి పోటీ చేస్తున్నారు. కనుక ఒకే ఓటుతో ఈ రెండు పార్టీల ముఖ్యనేతలను ఓడించే అవకాశం ఒక్క కామారెడ్డి ప్రజలకే లభించింది. కనుక బీజేపీకి ఓట్లు వేసి గెలిపించడం ద్వారా ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి.

తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటూ కేసీఆర్‌ అనేక హామీలు ఇచ్చి మాట తప్పారు. కానీ బీజేపీ మాటకు కట్టుబడి ఉండే పార్టీ. కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ర్యాంక్ వన్ పెన్షన్, వన్ నేషన్ వన్ రేషన్, అయోధ్య రామమందిరం నిర్మాణం, మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్ వంటి హామీలను నెరవేర్చాము. 

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నాము. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాము. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మాటిస్తున్నాను. దానికి మేము కట్టుబడి ఉంటాము. 

కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు వాటి గురించి, తమ వారసులకు పదవులు అధికారం గురించే ఆలోచించుకొంటాయి తప్ప ప్రజల కోసం, పిల్లల కోసం ఆలోచించవు. ఏమీ చేయవు. బిఆర్ఎస్ అవినీతి రాజ్యమేలుతోంది. సాగునీటి ప్రాజెక్టులు బిఆర్ఎస్ నేతలకు ఏటీఎంలా మారిపోయాయి. తెలంగాణ ఉద్యమాలలో వందల మంది పిల్లలు చనిపోగా, టిఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారం వలన లక్షల మంది పిల్లల భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారింది. వీటన్నిటితో తెలంగాణ ప్రజలు విసుగెత్తిపోయున్నారు. మార్పు కోరుకొంటున్నారు. కనుక బీజేపీని గెలిపించండి. మీరు కోరుకొన్న మార్పుని కళ్ళారా చూడండి,” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.