
తెలంగాణ సిఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తూ బిఆర్ఎస్ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం మంచిర్యాల, గోదావరిఖని, ములుగు, భూపాలపల్లిలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నారు.
వాటిలో ప్రజలను ఉదేశ్యించి మాట్లాడుతూ, “సింగరేణి సంస్థలో మొదట రాష్ట్ర ప్రభుత్వానికి 100శాతం వాటా ఉండేది. కానీ కాంగ్రెస్ హయాంలో కేంద్రం నుంచి రూ.600 కోట్లు అప్పు తెచ్చారు. దానిని తీర్చలేకపోవడంతో దానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో 49% వాటాని తీసుకొంది. ఆ విదంగా సింగరేణిలో కేంద్రం పెత్తనం మొదలైంది. మేము అధికారంలోకి వచ్చాక సింగరేణి అప్పులన్నీ తీర్చేయడమే కాక లాభాలలోకి తెచ్చి ఏటా దానిలో కార్మికులకు భారీగా బోనస్ కూడా చెల్లిస్తున్నాము.
కాంగ్రెస్, వామపక్షాల అనుబంద సంఘాలు కలిసి సింగరేణిలో కారుణ్య నియామకాలు లేకుండా చేస్తే, మేము అధికారంలోకి వచ్చాక 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించాము. సింగరేణి కార్మికులకు ఇళ్ళు కట్టుకొనేందుకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణం, ఉద్యోగ విరమణ తర్వాత ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు, కార్మికులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు వగైరా కల్పిస్తున్నాము. మళ్ళీ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికులకు వేతనాలపై ఆదాయ పన్ను మినహాయిస్తాము,” అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ గురించి కేసీఆర్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. “ఈసారి ఎన్నికలలో ఎలాగూ ఓడిపోబోతున్నామని గ్రహించిన కొందరు కాంగ్రెస్ అభ్యర్ధులు, తమను గెలిపిస్తే గెలిచిన తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతామని ప్రజలకు నచ్చజెప్పుకొంటున్నారట. అయితే 119 స్థానాలలో మా పార్టీ అభ్యర్ధులే పోటీ చేస్తున్నప్పుడు, కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించుడు ఎందుకు ఆనక వారు మా పార్టీలో చేరుడు ఎందుకు? కనుక బిఆర్ఎస్ అభ్యర్ధులనే గెలిపించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కేసీఆర్ అన్నారు.