13.jpg)
పోలింగ్‌కు నాలుగు రోజులు ముందు రైతుబంధు నిధులు విడుదల చేయడానికి ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించడంపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “దీంతో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య బంధం మరోసారి బయటపెట్టుకొన్నాయి. ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌ల మద్య ఫెవికాల్ వంటి బలమైన బంధం ఉందని స్పష్టమైంది.
రైతుబంధు పేరుతో ప్రజల సొమ్ముని ప్రజలకే పంచిపెడుతూ కేసీఆర్ ఓట్లు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. బిఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకి అన్నివిదాల సహకరించేందుకు ఈసీపై కేంద్రం ఒత్తిడి చేస్తోందని స్పష్టమైంది.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు విడుదల చేస్తోంది. కనుక రైతుబంధు సొమ్ము ఖాతాలలో పడినప్పటికీ రైతులెవరూ కేసీఆర్ మాయలో పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జనవరిలో కౌలు రైతులకు కూడా మేము రైతుబంధు చెల్లిస్తాము. కేసీఆర్ ఇస్తున్న సొమ్ము కంటే మరో 5,000 ఎక్కువే ఇస్తాము. మా మ్యానిఫెస్టోలో కూడా హామీ ఇచ్చాము. దానిని ఖచ్చితంగా అమలుచేస్తాము.
బిఆర్ఎస్ సలహాదారుడు ఏకే గోయల్ ఇంట్లో సుమారు రూ.300 కోట్లు ఓటర్లకు పంచిపెట్టేందుకు దాచి ఉంచారని నేను, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెపుతున్నా ఈసీ పట్టించుకోలేదు. ఇదే విషయం చెపుదామని సీఈవో వికాస్ రాజ్‌కు మేము ఫోన్ చేస్తే మాతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ కేసీఆర్ ఓ ఫోన్ చేస్తే కాంగ్రెస్ నేతల ఇళ్ళపై పోలీసులు, ఐటి, ఈడీ అధికారులు దాడులు చేస్తుంటారు.
కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందని మోడీ, అమిత్ షాలు చెపుతున్నప్పుడు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?అంటే ఆయనతో రహస్య అవగాహన ఉన్నందునే. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా కేసీఆర్ కుటుంబం అవినీతిపై విచారణ జరిపించి చట్టప్రకారం చర్యలు తీసుకొంటాము,” అని రేవంత్ రెడ్డి అన్నారు.