ఇప్పుడు రైతు బంధు అనుమతించడం వాటి కుట్రే!

మరో నాలుగు రోజులలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో కేంద్ర ఎన్నికల కమీషన్‌ రైతు బంధు నిధులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే కాంగ్రెస్‌ అభ్యర్ధన మేరకు ఈసీ రైతుబంధు నిధుల విడుదలని నిలిపివేయించింది. అయితే మరో నాలుగు రోజులలో పోలింగ్‌ జరుగబోతుంటే హటాత్తుగా ఇప్పుడు అనుమతించడంపై కాంగ్రెస్‌, బీఎస్పీలు భగ్గు మంటున్నాయి. 

బీఎస్పీ అధినేత ప్రవీణ్ కుమార్‌ స్పందిస్తూ, “ఎన్నికల నియమావళి అమలవుతున్నప్పుడు ఆఘమేగాల మీద రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే రైతు బంధు ముసుగులో ఓటర్లను ప్రభావితం  చేయడమే!2018 ఎన్నికలలో ఇదే జరిగింది. రైతుల రుణమాఫీ, ఉద్యోగుల డీఏ ఇవ్వడానికి అంగీకరించని ఈసీ రైతుబంధు నిధులు విడుదలకు ఎందుకు అంగీకరించింది? బిఆర్ఎస్‌, బీజేపీల మద్య రహస్య అవగాహన ఉందని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?” అని అన్నారు. 

సోషల్ మీడియాలో ఆయన చాలా ఘాటుగా ట్వీట్ చేశారు. ఆయన మాటలలోనే, “రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలవుతున్నప్పుడు @ECISVEEP ఆఘమేగాల మీద రైతు బంధు సాయం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమంటే "రైతు బంధు" ముసుగులో "ఓటర్ల" ను ప్రభావితం చేయడమే! 2018 లో కూడా ఇదే జరిగింది.

ఇదీ రాజకీయ ప్రలోభాల్లో భాగంగానే అని #BSP భావిస్తుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో రైతు బంధు విడుదల చేసిన KCR కు సడన్ గా ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం నవంబర్ నెలలోనే "బంధు" సాయం విడుదలకు #EC కి లేఖ రాయడం నిజంగా స్వార్థపూరితం.

దీనికి ఈసీ అనుమతి ఇవ్వడమంటే ఈసీ నిష్పక్షపాత వైఖరి మీద అనుమానాలొస్తున్నయ్! రుణమాఫీ నిధులు, ఉద్యోగులకు న్యాయబద్దంగా రావాల్సిన డీఏ విడుదలకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు బ్రేక్ వేసింది? వీరేం పాపం చేశారు? BRS, BJP రెండూ ఆడుతున్నఈ నాటకాన్ని గమనించాల్సిందిగా ప్రజలకు మనవి,” అంటూ ట్వీట్ చేశారు.