కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా వాద్ర శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు, హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించారు.
రాష్ట్రంలో బిఆర్ఎస్, బీజేపీ, మజ్లీస్ పార్టీలు పరస్పరం కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తున్నాయని కానీ ఆ మూడు పార్టీలు కలిసి ‘నాటునాటు’ డ్యాన్స్ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులలో కేసీఆర్ అక్రమంగా సంపాదించిన సొమ్ముని మజ్లీస్‌కు ఇస్తుంటే, ఆ డబ్బుతో ఆ పార్టీ దేశంలో 50-60 స్థానాలలో పోటీ చేస్తోందని, కానీ తెలంగాణలో ఎప్పుడూ 7-8 స్థానాలకే ఎందుకు పరిమితం అవుతోందని ప్రశ్నించారు.
సుమారు లక్షన్నర కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కుంగిపోతుంటే కేసీఆర్ దాని గురించి మాట్లాడకుండా ప్రజలకు ఇంకా కల్లబొల్లి కబుర్లు చెప్పి మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా వాద్రా ఆరోపించారు. మోడీ ఆదానీకి దేశాన్ని దోచిపెడుతుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబమే దోచేసుకొంటోందని ప్రియాంకా వాద్రా అన్నారు.
కనుక ఈ మూడు పార్టీలను తరిమికొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రియాంకా వాద్రా విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల ఋణమాఫీతో సహా ప్రతీ ఒక్క హామీని అమలుచేశాయని అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేస్తామని ప్రియాంకా వాద్రా అన్నారు.