బర్రెలక్కకు రక్షణ కల్పించండి: ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కార్నే శిరీష (బర్రెలక్క) కుటుంబ సభ్యులపై దాడులు జరుగుతున్న నేపధ్యంలో తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

దానిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు ఆమెకు తక్షణం ఒక గన్‌మ్యాన్‌తో రక్షణ కల్పించాలని, ఆమె సభలు, సమావేశాలకు పోలీసులతో రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 

“ఎన్నికల సంఘం కేవలం గుర్తింపు కలిగిన పార్టీల అభ్యర్ధులకు మాత్రమే రక్షణ కల్పిస్తాం అంటే కుదరదు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధులకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. అలాగే పోలీసులు వాహనాలను తనికీలు మాత్రమే చేస్తామంటే కుదరదు. అభ్యర్ధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారికి కూడా ఉందని మరిచిపోకూడదు. తక్షణం శిరీషకు భద్రత కల్పించాలి,” అని ఆదేశించింది. 

బర్రెలక్కగా ప్రజలకు చిరపరిచితురాలైన శిరీషకు నియోజకవర్గంలో మంచి ప్రజాధరణ ఉంది. కనుక ఆమె పోటీ చేస్తే ఓట్లు చీలి నష్టపోతామని మూడు పార్టీలు భయపడుతున్నాయి. అందుకే ఆమెను నామినేషన్ ఉపసంహరించుకోమని చాలా ఒత్తిడి చేశాయి.

ముఖ్యంగా విజయావకాశం ఎక్కువగా ఉందనుకొంటున్న ఓ పార్టీ అభ్యర్ధి తనపై కక్ష కట్టాడని, ఇటీవల తన తమ్ముడు పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన అనుచరులు తనపై, తన తమ్ముడిపై దాడి చేసి గాయపరిచారని ఆమె హైకోర్టుకి ఫిర్యాదు చేసింది.

అయితే తాను ఎట్టి పరిస్థితులలో వెనక్కు తగ్గబోనని ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని బర్రెలక్క చెప్పింది. నాలుగైదు సార్లు ఎన్నికలలో గెలిచిన నేతలు కూడా తనను చూసి భయపడటం దేనికని ఆమె ప్రశ్నిస్తోంది.