బిఆర్ఎస్‌కు ఎమ్మెల్యే అబ్రహం గుడ్ బై

జోగులాంబ గద్వాల్ జిల్లా, ఆలంపూర్ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే అబ్రహం పార్టీకి రాజీనామా చేసి నేడు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆగస్ట్ 21న కేసీఆర్‌ ప్రకటించిన 115 మంది బిఆర్ఎస్‌ అభ్యర్ధుల జాబితాలో ఆయన పేరున్నప్పటికీ, చివరి నిమిషంలో ఆయన స్థానంలో కె.విజయుడుకి బీఫారం ఇవ్వడంతో అబ్రహం చాలా అసంతృప్తిగా ఉన్నారు. అప్పటి నుంచే పార్టీకి, ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు.

ఆ కారణంగానే పార్టీకి రాజీనామా చేసి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆలంపూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, బిఆర్ఎస్‌ పార్టీని చాలా బలోపేతం చేశానని, కానీ కేసీఆర్‌ తనను కాదని వేరే వారికి టికెట్‌ ఇచ్చి అవమానించారని అబ్రహం ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి కె.విజయుడు (బిఆర్ఎస్‌), సంపత్ కుమార్‌ (కాంగ్రెస్‌), రాజగోపాల్ (బీజేపీ) పోటీ చేస్తున్నారు. 

గద్వాల్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(బిఆర్ఎస్‌), సరిత తిరుపతయ్య (కాంగ్రెస్‌), శివారెడ్డి (బీజేపీ) పోటీ చేస్తున్నారు.