
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ, “ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు. నియంతృత్వ పాలన కొనసాగాలా లేదా ప్రజల మద్య మతచిచ్చు పెట్టే కాషాయ పార్టీ కావాలా లేక అందరినీ కలుపుకుపోయే లౌకికవాద కాంగ్రెస్ ప్రభుత్వం కావాలో మీరే ఆలోచించుకోండి.
హుజూరాబాద్ ఉపఎన్నికలలో నన్ను సాదుకొంటారా సంపుకొంటారా అంటూ బొలిబొలి ఏడ్పులు ఏడ్చి మీ సానుభూతితో గెలిచిన ఈటల రాజేందర్ మీ నియోజకవర్గం కోసం, మీ కోసం ఏమైనా చేశారా? ఓ సారి ఆలోచించుకోండి.
రాష్ట్రంలో ఈ దొరలపాలన పోవాలి. కాంగ్రెస్ రావాలి. అప్పుడే రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. కనుక ఒక్కసారి కాంగ్రెస్కు అవకాశం ఇచ్చి గెలిపించమని అందరినీ కోరుతున్నాను. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వొడితెల ప్రణవ్కే మీరందరూ ఓట్లు వేసి గెలిపించమని కోరుతున్నాను,” అని రేవంత్ రెడ్డి అన్నారు.