రఘునందన్ రావు దుబ్బాకకు ఏం చేశాడు? రేవంత్‌

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి గురువారం దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తానని రఘునందన్ రావు అన్నాడు. కానీ గెలిచిన తర్వాత నియోజకవర్గం వైపు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రాగానే మీవద్దకు వచ్చి ఓట్లు వేయమని అడుగుతున్నాడు.

దుబ్బాక ఉపఎన్నికలలో బిఆర్ఎస్‌ అభ్యర్ధి ఓడిపోగానే దుబ్బాకకు కేటాయించిన దళిత బంధు నిధులను కేసీఆర్‌, హరీష్ రావు కలిసి సిద్ధిపేటకు తరలించుకుపోతున్నా రఘునందన్ రావు పట్టించుకోలేదు. దుబ్బాక ప్రజలను పట్టించుకోని బీజేపీ, బిఆర్ఎస్‌ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలి?

బిఆర్ఎస్‌, బీజేపీ నేతల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మీవాడు. ఎల్లప్పుడూ మీ మద్యనే ఉంటాడు. ఆయనకు ఓట్లు వేసి గెలిపించుకొంటే, రేపు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దుబ్బాక అభివృద్ధిని ఆయనే చూసుకొంటాడు,” అని అన్నారు.