
సిఎం కేసీఆర్ ఈరోజు మహేశ్వరంలో బిఆర్ఎస్ అభ్యర్ధి, మంత్రి సబితారెడ్డి తరపున ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్ తీరు ఎలా ఉందంటే మీరు వండిపెడితే మేము వడ్డిస్తామన్నట్లు ఉంది. ఎంతో ఆర్ధిక క్రమశిక్షణతో, దూరదృష్టితో ఆలోచిస్తూ, చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఈ పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకొన్నాము. రాష్ట్ర సంపద పెంచి దానిని సమాజంలో అందరికీ పంచుతున్నాము.
అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ తాగునీటి పైప్ లైన్ నిర్మాణం జరుగుతోంది. అది అందుబాటులోకి వస్తే మహేశ్వరం ప్రజలకు ఇక ఎన్నటికీ తాగునీటి సమస్య ఉండదు. త్వరలో ఫాక్స్ కాన్ కంపెనీ ఏర్పాటుకాబోతోంది. దాంతో సుమారు లక్షమందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి.
ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే అందరూ కలిసి దోచుకొని తినేస్తారు. తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది. కనుక కాంగ్రెస్,బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ కోసం నిబద్దతతో పనిచేసే బిఆర్ఎస్ పార్టీకే మళ్ళీ ఓట్లు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
సబితా ఇంద్రా రెడ్డి కృషి వలనే కందుకూరులో మెడికల్ కాలేజీ వచ్చింది. ఆమె మీ నియోజకవర్గాన్ని ఎంతగా అభివృద్ధి చేశారో మీకే తెలుసు. కనుక ఆమెకే ఓట్లు వేసి గెలిపించుకొంటే మీ నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తారు,” అని అన్నారు.