కాంగ్రెస్ పేరే ఎర్రడైరీలో ఉందిప్పుడు: కల్వకుంట్ల కవిత

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌లో ఎన్నికల సభలో మాట్లాడుతూ, బిఆర్ఎస్‌ కనుసన్నలలో పనిచేస్తూ కాంగ్రెస్‌ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న అధికారులు అందరి పేర్లు కాంగ్రెస్‌ ఎర్ర డైరీలో నోట్ చేసుకొంటున్నామని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వారందరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “అధికారులందరూ ఎన్నికల సంఘం ఆధీనంలోనే పనిచేస్తున్నారనే విషయం మీకు గుర్తున్నట్లు లేదు. వారందరూ పారదర్శకంగానే పనిచేస్తున్నారు. కనుకనే ఎన్నికల సంఘం వారి చేతే ఎన్నికల ప్రక్రియ నిర్వహింపజేస్తోంది. కనుక మీరు అధికారుల పేర్లు ఎర్ర డైరీలో వ్రాసుకోవడం కాదు... మీ కాంగ్రెస్‌ పార్టీనే ప్రజలు తమ ఎర్ర డైరీలో చేర్చారు.

ఎన్నికలలో గెలవలేమనే నిరాశనిస్పృహలతో కాంగ్రెస్‌ నేతలు బిఆర్ఎస్‌ అభ్యర్ధులపై దాడులు చేస్తున్నారు. వీటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కనుక ఎన్నికలలో వారే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అల్లర్లను జిల్లాలకు వ్యాపింపజేస్తుంటే, మా ప్రభుత్వం ఐ‌టి రంగాన్ని జిల్లాలకు వ్యాపింపజేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తోంది.

కాంగ్రెస్‌కు 80 సీట్ల కంటే తక్కువ వస్తే మేము ఏదంటే అది చేస్తామని రేవంత్‌ రెడ్డి సవాలు విసరడం చాలా హాస్యాస్పదంగా ఉంది. గత ఎన్నికలలో కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు కదా?కానీ ఓడిపోయినా రాజకీయాలలోనే ఉన్నారు. మళ్ళీ కొడంగల్ నుంచే పోటీ చేస్తున్నారు కదా?” అని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.