
తెలంగాణ బిజెపి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు ముగ్గురూ శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తుంటే, పార్టీ అధ్యక్షుడు, ఎంపీ కిషన్రెడ్డి మాత్రం శాసనసభ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయడంలేదు? అనే ప్రశ్న ఇటీవల తరచూ వినబడుతోంది.
దానిపై ఆయన స్పందిస్తూ, “ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేయాలని పార్టీ నిర్ణయించింది. కనుక నేను పోటీ చేస్తే ప్రజలకు, పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుంది. దాంతో అయోమయం సృష్టించిన్నట్లవుతుంది. అందుకే నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎన్నికలలో పోటీ చేయడం లేదు. ఈసారి ఎన్నికలలో బీజేపీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావడం, బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమే,” అని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పులు చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. భూములు, మద్యం అమ్మితే తప్ప సంక్షేమ పధకాలు నడిచే పరిస్థితి లేదు. ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే మరోపక్క కేసీఆర్ కుటుంబం దేశంలోకే అత్యంత ధనిక కుటుంబంగా, బిఆర్ఎస్ పార్టీ అత్యంత ధనిక పార్టీగా నిలుస్తున్నాయి. తెలంగాణతో కేసీఆర్ కుటుంబం బాగుపడింది కానీ సామాన్య, నిరుపేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కనుక కేసీఆర్ని గద్దె దించి బీసీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టాలి,” అని కిషన్ రెడ్డి అన్నారు.