తెలంగాణ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం హన్మకొండలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “అనేకమంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణ ప్రభుత్వ అవినీతిని చూస్తునప్పుడు దీని కోసమేనా వారు బలిదానాలు చేసుకొన్నారని ఆవేదన కలుగుతుంది.
ఇటీవలే బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓ నాయకుడు తెలంగాణలో చేపట్టే ఏ ప్రాజెక్టు పనులలో అయినా కాంట్రాక్ట్ కంపెనీలు 6 నుంచి 8 శాతం నేరుగా ముఖ్యమంత్రికే కమీషన్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతీ పనికి నిర్ధిష్ట పర్సంటేజ్ ఉంటుందని ఆయనే చెప్పారు. ఉన్నతస్థాయిలోనే ఇంత అవినీతికి పాల్పడుతుండటం చాలా బాధ కలిగింది.
తెలంగాణ ప్రజలకు మేలు కలగాలని కోరుకొనేవాడిని నేను. కనుక ఈ అవినీతి ప్రభుత్వం పోయి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి. దళిత ముఖ్యమంత్రి రావాలని కోరుకొన్నాను. కానీ అది సాధ్యం కాలేదు. కనుక ఈసారి బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తున్న బిజీపీకి అందరూ ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రావు పద్మలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను," అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ, "ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసి దేశంలో ప్రశాంతత నెలకొల్పి, ప్రపంచ దేశాలలో భారత్ గౌరవాన్ని ఇనుమడింపజేసిన ప్రధాని నరేంద్రమోడీ అంటే నాకు చాలా గౌరవం. ఇక్కడ తెలంగాణలో బిజేపీ రావాలని, అక్కడ కేంద్రంలో మళ్ళీ మోడీ నాయకత్వంలోనే బీజేపీ ప్రభుత్వమే రావాలని కోరుకొంటున్నాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.