ఎన్నికలకు ముందు బీజేపీకి అశ్వథామ రెడ్డి రాజీనామా

అశ్వథామ రెడ్డి…. టిఎస్‌ఆర్టీసీ 55 రోజులు నిరవదిక సమ్మె చేసినప్పుడు ఈ పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం నుంచి ఒత్తిళ్ళు తట్టుకోలేక బీజేపీని ఆశ్రయించి కాషాయ కండువా కప్పుకొన్నారు.

ఈసారి శాసనసభ ఎన్నికలలో ఆయన వనపర్తి నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలనుకొన్నారు. ఆయన టిఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘానికి నాయకుడు కనుక బీజేపీ కూడా ఆయనకు టికెట్‌ ఇవ్వాలనే భావిచింది. కానీ చివరి నిమిషంలో ఆయనకు బదులు అనుజ్ఞ రెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు.

ఇంతకాలం మౌనంగా ఉండిపోయిన ఆయన బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించిన రాజీనామా లేఖలో ఆయన ఎటువంటి కారణం పేర్కొనలేదు. త్వరలోనే తన భవిష్య కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.