తెలంగాణలో ప్రచారానికి ప్రధాని మోడీ మరోసారి

ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కనుక బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు.

ఈ నెల 25వ తేదీన ఆయన మహేశ్వరం, కామారెడ్డిలో జరిగే ఎన్నికల సభలలో పాల్గొంటారు. మర్నాడు నవంబర్‌ 26న తుఫ్రాన్, నిర్మల్ నియోజకవర్గాలలో బీజేపీ సభలలో పాల్గొంటారు. చివరిగా 27వ తేదీన ఉదయం మహబూబాబాద్, మధ్యాహ్నం కరీంనగర్‌లో జరిగే బీజేపీ సభలలో పాల్గొన్నాక హైదరాబాద్‌ చేరుకొంటారు.

ఆ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షో ముగిసిన తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యి వారికి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు. 

ఈసారి ఎన్నికలలో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని 8 స్థానాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్ షోలో ప్రధాని మోడీతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొంటారు.