కేసీఆర్‌ నర్సాపూర్ సభలో దొరికినవి ఖాళీ తూటాలే

సిఎం కేసీఆర్‌ పాల్గొన్న నర్సాపూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఓ యువకుడు రెండు తూటాలతో పోలీసులకు పట్టుబడటం కలకలం సృష్టించింది. అతను విలేఖరుల గ్యాలరీ వైపు వెళుతుండగా పోలీసులు తనికీ చేయగా అతని పర్సులో నుంచి రెండు తూటాలు కిందపడ్డాయి. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నించగా అతని పేరు మహమ్మద్ అస్లం (35) అని, సంగారెడ్డి జిల్లా రాయికోడ్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను చండూర్‌లో ఓ చికెన్ షాపులో పార్ట్ టైమ్ పనిచేస్తూ, ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు విలేఖరిగా పనిచేస్తున్నాడు. 

అతను 2016లో ఎన్‌సీసీలో శిక్షణ పొందాడు. ఆ సమయంలోనే ఎన్‌సీసీ ఫైరింగ్ క్యాంప్ వద్ద లభించిన రెండు ఖాళీ తూటాలను తీసి భద్రపరుచుకొన్నాడని పోలీసులు కనుగొన్నారు. అతను బిఆర్ఎస్ పార్టీ అభిమాని. సోషల్ మీడియాలో కేసీఆర్‌కు, బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి సభకు తూటాలతో వచ్చి కలకలం సృష్టించినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.