బిఆర్ఎస్‌ వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ: కవిత

ఎన్నడూ లేనివిదంగా ఈసారి కేసీఆర్‌ గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారు? అనే ప్రశ్నకు ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పుకొంటున్నారు. ఆయన కుమార్తె, బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రముఖ తెలుగు ఛానల్ టీవీ 9 నిర్వహించిన 'ఐదుగురు ఎడిటర్లతో ముఖాముఖీ' సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆమెను ఇదే ప్రశ్న అడిగారు.

ఆమె ఏమన్నారంటే, “రెండు నియోజకవర్గాలలో పోటీ చేయడం తప్పేమీ కాదు కదా?మా పార్టీ వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌ ఈసారి రెండు చోట్ల పోటీ చేస్తున్నారు తప్ప ఎవరికో భయపడి కాదు. రెండు చోట్ల ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారని అందరికీ తెలుసు,” అని అన్నారు. 

“కామారెడ్డి సీటుని మీ కోసం కేసీఆర్‌ అట్టేపెడుతున్నారట కదా?” అనే మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, “నా కోసం కేసీఆర్‌ ఓ సీటు అట్టే పెట్టాల్సిన దయనీయమైన పరిస్థితిలో నేను లేను. ఈసారి గజ్వేల్‌ కంటే ఓ వెయ్యి ఓట్లు అదనంగా వేసి కేసీఆర్‌ని గెలిపిస్తే కామారెడ్డి సీటుని ఉంచుకోమని నేనే ఆయనకు నచ్చజెపుతాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.