మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేశారు.
వాటిపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, “ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇస్తామని ప్రకటించి వెనక్కు తగ్గడంతో ఇక తెలంగాణ రాదనే నిరాశనిస్పృహలతో అనేకమంది యువత బలిదానాలు చేసుకొన్నారు. అది మీ వలనే కదా? ఆనాడు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయే వరకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు కదా?
మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడే నిజాం సంస్థానం కూడా ఉండేదనే సంగతి మీకు తెలియదని అర్దమైంది. ఇంతమంది చనిపోవడానికి కారణం మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు వచ్చి చరిత్ర గురించి మాట్లాడుతుండటం ఎలా ఉందంటే హంతకుడే వచ్చి సంతాపం తెలిపిన్నట్లుంది.
తెలంగాణ ఆర్ధిక క్రమశిక్షణ కలిగిన రాష్ట్రం. అందుకే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందింది. మీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒకటీ రెండుసార్లు కాదు... 11సార్లు అవకాశం ఇచ్చారు. కానీ మీ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని విదాల భ్రష్టు పట్టించేసింది. అందుకే దేశప్రజలు మీ పార్టీని గద్దె దించేశారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయి, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొనిదే మనుగడ సాగించలేని దుస్థితికి దిగజారుకొంది. తెలంగాణ ప్రజలకు మీ కాంగ్రెస్ పాలన ఏవిదంగా ఉంటుందో తెలుసు. కనుక మీ కల్లబొల్లి కబుర్లు నమ్మి మళ్ళీ మోసపోతారనుకోవద్దు,” అని ఘాటుగా బదులిచ్చారు.