ఖమ్మంలో తుమ్మలకు టిడిపి ఫుల్ సపోర్ట్!

తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచేందుకుగాను టిడిపి ఎన్నికల బరిలో నుంచి తప్పుకొందనేది బహిరంగ రహస్యం. ఈ విషయం ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావుకు స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు మద్దతు పలుకడంతో స్పష్టమైంది. ఈరోజు టిడిపి నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు టిడిపి కండువా ధరించి, టిడిపి శ్రేణులకు అభివాదం చేశారు. తన గెలుపు కోసం కృషి చేస్తున్న తెలుగు తమ్ముళ్ళు అందరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

ఆయన ఏమన్నారంటే “బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో టిడిపి శ్రేణులు చాలా ఇబ్బందిపడుతున్నాయని నాకు తెలుసు. కానీ కాంగ్రెస్ పాలనలో మీకెవరికీ ఎటువంటి ఇబ్బందీ ఉండదని నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణలో టిడిపి అధికారంలో లేకపోయినా పదేళ్ళపాటు మీరందరూ పార్టీని కాపాడుకొంటూ వచ్చారు. ఇప్పుడు నా కోసం మీరందరూ తరలివచ్చి మద్దతు ఇస్తున్నారు. ఈ జన్మకు ఇంతకంటే మరేదీ గొప్ప విషయం అని నేను అనుకోవడం లేదు. మీరు ఎక్కడ ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్నా మీరందరూ నా తమ్ముళ్ళే. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మరిచిపోవద్దు. అలాగే నేను కూడా మీ రుణం ఎన్నటికీ మరిచిపోలేను,” అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.