తెలంగాణ శాసనసభలో 119 సీట్లు... 2,290 మంది అభ్యర్ధులు!

తెలంగాణ శాసనసభలో 119 స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ నామినేషన్స్‌ ఉపసంహరణ తర్వాత కూడా ఇంకా 2,290 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో44 మంది, కామారెడ్డిలో 39 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో అత్యల్పంగా నారాయణపేటలో కేవలం ఏడుగురు, బాల్కొండలో 8మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా అత్యధికంగా ఎల్బీ నగర్‌లో 48 మంది పోటీ చేస్తున్నారు. 

ఈటల రాజేందర్‌ పోటీ చేస్తున్న హుజూరాబాద్‌- 22, రేవంత్‌ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్-13, కేటీఆర్‌ పోటీ చేస్తున్న సిరిసిల్లా-21, సిద్ధిపేటలో హరీష్ రావుపై 21, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుపై-32, పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై-37, కరీంనగర్‌లో బండి సంజయ్‌పై 27 మంది పోటీ చేస్తున్నారు. 

ఈవీఎంలో 15 మంది అభ్యర్ధులు వారి ఎన్నికల గుర్తులు ఉంటాయి. 16వ బటన్ నోటాకు కేటాయించబడుతుంది. రాష్ట్రంలో 58 నియోజకవర్గాలలో 15 కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. కనుక ఆ నియోజకవర్గాలలో రెండు కంటే ఎక్కువ ఈవీఎంలు వినియోగించడం అనివార్యంగా మారింది. ఈవీఎంల సంఖ్య పెరిగితే ఓటర్లు అయోమయం చెందే అవకాశాలు ఉంటాయి. అది మూడు ప్రధాన పార్టీలకు చాలా నష్టం కలిగించవచ్చు. ఇక ఇంచుమించు ఒకే విదంగా కనిపించే ఎన్నికల చిహ్నాలు, ఒకే పేరు గల అభ్యర్ధుల వలన అన్ని పార్టీలు నష్టపోతూనే ఉంటాయి.