సంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. ఆయన నర్సాపూర్ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజారెడ్డికి టికెట్ కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసి, కాంగ్రెస్ అధిష్టానం తనకే తప్పకుండా బీ-ఫారం ఇస్తుందని ఆశించారు. కానీ ఆవుల రాజారెడ్డికే బీ-ఫారం ఇవ్వడంతో గాలి అనిల్ కుమార్ నిన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.
మంత్రి హరీష్ రావు ఈరోజు ఉదయం అమీన్‌పూర్‌లోని ఆయన నివాసానికి వెళ్ళి బిఆర్ఎస్ పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. అందుకు సానుకూలంగా స్పందించిన గాలి అనిల్ కుమార్ ఈరోజు నర్సాపూర్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.
నర్సాపూర్ బీజేపీలో కూడా ఇంచుమించు ఇటువంటి పరిణామాలే జరిగాయి. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగయిపల్లి గోపీ పోటీ చేయాలనుకొంటే, మురళీ యాదవ్‌కు టికెట్ లభించింది. దీంతో గోపి ఆయన అనుకఃరులు కూడా పార్టీకి రాజీనామా చేసారు. .
ఎన్నికలకు ముందు అన్ని పార్టీలలో ఇటువంటి పరిణామాలు సర్వసాధారణమే కానీ నియోజకవర్గంలో బలమైన నాయకులు ప్రత్యర్ధి పార్టీలో చేరిపోతే భారీగా నష్టం జరుగుతుంది. నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్ధి సునీతా లక్ష్మారెడ్డికి ఈ పరిణామాలు కలిసిరావచ్చు.