10.jpg)
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూడా చాలా జోరుగానే ప్రచారం చేస్తున్నప్పటికీ ఈసారి అది మూడో స్థానానికే పరిమితం కాబోతోందని సర్వేలు తేల్చి చెప్పేశాయి. అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు తెలంగాణలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు తరలివస్తున్నారు.
ఈ నెల 18వ తేదీన అమిత్ షా మరోసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఇదివరకు వచ్చినప్పుడు బీజేపీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. కానీ ఆ బీసీ ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించకపోవడం వలన దానికి ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాలేదు. తర్వాత వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కూడా బీసీ ముఖ్యమంత్రి అని అన్నారే కానీ ఎవరో చెప్పలేదు.
అమిత్ షా మళ్ళీ ఈ నెల 18న తెలంగాణకు రాబోతున్నారు. ఆయన ఒకే రోజున నాలుగు ప్రాంతాలలో సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు.
ఆరోజు ఉదయం 10 గంటలకు గద్వాలలో, మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండలో, 2 గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, సాయంత్రం 4 గంటలకు రాజేంద్ర నగర్‌లో బీజేపీ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అవి ముగిసిన తర్వాత మళ్ళీ ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు. కనీసం ఈ సారి పర్యటనలోనైనా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ప్రకటిస్తే అది ఎన్నికలలో ‘గేమ్ చేంజర్’ కావచ్చు. కానీ దాని వలన పార్టీలో అలకలు మొదలయ్యే ప్రమాదం ఉంటుంది కూడా. బహుశః అందుకే ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ప్రకటించడానికి వెనకాడుతున్నట్లున్నారు.