సీనియర్ కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం తరపున ఆయనని బుజ్జగించేందుకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మల్లు రవి ఈరోజు ఉదయం ఆయనని కలిశారు. మొదట ఆయన వారిని కలిసేందుకు నిరాకరించారు. ఆయన అనుచరులు కూడా వారిని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు.
అయితే పటేల్ రమేష్ రెడ్డే వారిని లోనికి పిలిచి మాట్లాడారు. ఇప్పుడు టికెట్ ఇవ్వలేకపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని వారు ఆయనకు నచ్చజెప్పారు. ఈసారి కాంగ్రెస్ విజయావకాశాలున్నందున అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌లో అందరికీ మేలు కలుగుతుందని, కనుక కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర్ రెడ్డి గెలుపుకి సహకరించవలసిందిగా వారు నచ్చజెప్పిన్నట్లు తెలుస్తోంది.
ఎంపీ టికెట్ హామీతో పటేల్ రమేష్ రెడ్డి కూడా చల్లబడి నామినేషన్ ఉపసంహరించుకొని కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకు అన్ని విదాల సహకరిస్తానని వారికి మాట ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. దీంతో సూర్యాపేట కాంగ్రెస్‌లో ఏర్పడిన సంక్షోభం సమసిపోయిన్నట్లే భావించవచ్చు. ఇక బిఆర్ఎస్, బీజేపీలను ఏవిదంగా ఎదుర్కోవాలో ఆలోచించాల్సి ఉంటుంది.