ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్స్ ఉపసంహరణ గడువు ముగియనుంది. బుజ్జగింపులతో ఇప్పటికే పలువురు స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్స్ ఉపసంహరించుకోగా, కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నవారు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.
సూర్యాపేట టికెట్ తనకే లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చి దామోదర్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించింది. అలాగే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవ రెడ్డిని కాదని నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అలాగే పలు నియోజకవర్గాలలో టికెట్ కోసం పోటీ పడినవారిలో ఎవరో ఒకరికే దక్కడంతో మిగిలినవారు కూడా పార్టీపై ఆగ్రహంతో రాజీనామాలు చేయడమో లేదా స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్స్ వేయడమో చేశారు.
సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి, వరంగల్ పశ్చిమలో జంగా రాఘవ రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్స్ వేశారు. తాము ఎట్టి పరిస్థితులలో వెనక్కు తగ్గేదేలే అని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న దామోదర్ రెడ్డిని, రాఘవరెడ్డిని ఓడించి ప్రతీకారం తీచుకొంటామని ఇద్దరూ శపధం చేశారు. వారిని బుజ్జగించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరి వారిరువురూ వెనక్కు తగ్గుతారో లేదో ఈరోజు మధ్యాహ్నం గడువు ముగిసిన తర్వాత తెలుస్తుంది.