మొత్తం 2,898 నామినేషన్స్‌కి ఆమోదం

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో 119 స్థానాలలో పోటీ చేసేందుకు 4,798 మంది నామినేషన్స్ వేయగా వాటన్నిటినీ పరిశీలించిన తర్వాత వాటిలో 2,898 ఆమోదించామని, 606 తిరస్కరించామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్‌ ఉపసంహరణకు గడువు ఉంది. 

ఒక్కో ఈవీఎం మెషీన్‌లో 16వ బటన్ నోటాకి కేటాయించినందున 15మంది అభ్యర్ధులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కనుక 16 మంది కంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న నియోజకవర్గాలలో అభ్యర్ధుల సంఖ్యని బట్టి ఈవీఎంల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది మూడు ప్రధాన పార్టీల విజయావకాశాలను దెబ్బ తీస్తుంది. కనుక నామినేషన్స్ ఉపసంహరించుకోవాలంటూ అభ్యర్ధులను మూడు పార్టీలు బ్రతిమలాడుతున్నాయి. రేపు గడువు ముగిసే సరికి ఎంతమంది నామినేషన్స్‌ ఉపసంహరించుకొంటారో తేలిపోతుంది. 

కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 114 నామినేషన్స్‌కు ఆమోదం లభించగా వారిలో 28 మంది ఉపసంహరించుకొన్నట్లు ప్రకటించారు. ఇంకా 86 మంది అభ్యర్ధులున్నారు. 

కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డిలో 56 మంది బరిలో మిగిలారు. మేడ్చల్లో 67, ఎల్బీ నగర్‌లో 57 మంది ఇంకా బరిలో ఉన్నారు. రేపు గడువు ముగిసేలోగా మరికొందరు వెనక్కు తగ్గవచ్చు.