అభివృద్ధి చూసి ఓట్లు వేయండి: కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికల ప్రచారం రోజుకి మూడు నియోజకవర్గాలకు వెళుతున్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, “ఎన్నికలు రాగానే ఎవరెవరో వచ్చి ఏవేవో మాయమాటలు చెప్పి పోతుంటారు. ఉన్నవి లేన్నట్లు లేనివి ఉన్నట్లు భ్రమింపజేస్తారు. కానీ నేను ఎల్లప్పుడూ మీ ఎదుటే ఉన్నాను. ఇకపై కూడా ఉంటాను. ఈ పదేళ్ళలో పాలకుర్తి నియోజకవర్గమే ఎంతగా అభివృద్ధి చేశామో మీరే స్వయంగా కళ్ళారా చూస్తున్నారు. కనుక మా ప్రభుత్వం పనితీరు ఏవిదంగా ఉందో మీకే బాగా తెలుసు. 

ఒకప్పుడు రాష్ట్రంలో ఉపాధి లభించక పాలకుర్తి నుంచే వేలాది మంది పొట్ట చేత్తో పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోతుండేవారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారే ఉద్యోగాలు, ఉపాధి కోసం మన రాష్ట్రానికి వస్తున్నారు. ఒక్క పాలకుర్తి నియోజకవర్గంలోనే 1.30 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాము. 

మీ ఊళ్ళలో పొలాలకు నీళ్ళు అందుతున్నాయా లేదా? 24 గంటలు కరెంటు ఉందా లేదా? రైతుబంధు డబ్బులు మీ ఖాతాలలో పడుతున్నాయా లేదా? నేను చెప్పినవన్నీ నిజమేనని అంగీకరిస్తున్నట్లయితే, మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లేసి గెలిపించాలని మనవి చేస్తున్నాను. 

ఒకవేళ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తామని, ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, రైతు బంధు నిలిపివేస్తామని కాంగ్రెస్‌ నేతలే చెపుతున్నారు కదా?మరి అలాంటి పార్టీకి ఓట్లు వేయాల్సిన అవసరముందా? కాంగ్రెస్‌ పాలనను చూశారు. బిఆర్ఎస్ పాలనను కూడా చూశారు. రెంటిలో ఏది మంచిగుందో మీరే నిర్ణయించుకొని ఓట్లు వేయండి,” అని అన్నారు.