మరో 15 రోజులలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్యనే ప్రధానంగా పోటీ నెలకొన్నప్పటికీ, ఇప్పుడు బీజేపీ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండటంతో మూడు పార్టీలలో దేనికెన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కనుక అనేక సర్వే సంస్థలు రాష్ట్రంలో సర్వేలు జరిపి ప్రజల నాడిని తెలుసుకొని తమ అంచనాలు వెల్లడిస్తున్నాయి.
తాజాగా డెమోక్రసీ టైమ్స్ నెట్‌వర్క్ సంస్థ తన నివేదికను ప్రకటించింది. దీని ప్రకారం ఈసారి బిఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు మెజారిటీ రాదని రెంటికీ ఇంచుమించు సరిసమానంగా సీట్లు వస్తాయని వెల్లడించింది. బిఆర్ఎస్-45, కాంగ్రెస్-42, బీజేపీ-4, మజ్లీస్-6 స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉందని తెలిపింది. అంటే హంగ్ ఏర్పడే అవకాశం ఉందనుకోవచ్చు.
హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఈసారి బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్య గట్టిపోటీ జరుగుతుందని, ఈ జిల్లాలలో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే అదే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలదని కానీ రెండు పార్టీల మద్య పోటీ చాలా తీవ్రంగా ఉన్నందున రెంటికీ ఇంచుమించు సరిసమానంగా సీట్లు వచ్చే అవకాశం ఉందని డెమోక్రసీ టైమ్స్ నెట్‌వర్క్ సంస్థ వెల్లడించింది.