వైఎస్సార్ తెలంగాణ పార్టీ కధ అలా ముగిసింది

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిలకు ఈరోజు మరో పెద్ద షాక్ తగిలింది. మొదటి నుంచి ఆమె వెన్నంటి నడిచిన గట్టు రామచంద్రరావు అధ్వర్యంలో ఆ పార్టీలో ఉన్న కొద్ది మంది నేతలు సోమవారం మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇదివరకే వారు వైఎస్ షర్మిలని పార్టీ నుంచి బహిష్కరించినవారందరూ, ఇవాళ్ళ తమ పార్టీని బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి హరీష్ రావు వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకొన్నారు. 

దీంతో వైఎస్ షర్మిల సైన్యం లేని సైన్యాద్యక్షురాలిగా ఒంటరిగా మిగిలిపోయారు. ఆమె కాంగ్రెస్‌ హామీలను నమ్మి తన పార్టీని దానిలో విలీనం చేసేందుకు సిద్దపడటంతో ఆమె రాజకీయ పతనం ప్రారంభమైంది.

ఒకవేళ ఆమె ఆ ఆలోచన చేయకుండా ఉంటే బహుశః నేటికీ పార్టీ క్యాడర్ ఆమె వెంటే ఉండేవారేమో? అప్పుడు ఆమె చెప్పుకొన్నట్లు 30-40 స్థానాలలో పోటీ చేయగలిగి ఉండేవారు కూడా.

కానీ తనను నమ్ముకొని తిరిగిన పార్టీ నేతలను, కార్యకర్తలను సంప్రదించకుండా, వారిని పట్టించుకోకుండా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్దపడటంతో పార్టీని కోల్పోయారు. కాంగ్రెస్‌ హ్యాండ్ ఇవ్వడంతో రాజకీయంగా కూడా నష్టపోయారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినప్పటికీ ఆ పార్టీలో ఆమెను పట్టించుకొనే నాధుడే లేడు.

మరి ఆమె రాజకీయాల నుంచి తప్పుకొంటారా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకొంటారో?