కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 17వ తేదీన తెలంగాణకు రానున్నారు. అప్పటి నుంచి 23వరకు తెలంగాణలోనే మకాం వేసి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకా వాద్రా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే బిఆర్ఎస్, బీజేపీలను బలంగా ఢీకొంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పుడు ప్రచారం కీలక దశకు చేరుకొన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు తరలి వస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందుకు తగ్గట్లు సభలు, రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ నెల 25వ తేదీన వస్తున్నారు. ఆయన కూడా ఈ నెల 27 వరకు తెలంగాణలోనే మకాం వేసి మూడు రోజులు ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనబోతున్నారు. నవంబర్ 25వ తేదీన కరీంనగర్ జనగర్జన సభలో పాల్గొంటారు. 26వ తేదీన నిర్మల్ పట్టణంలో జరిగే జనగర్జన సభలో పాల్గొంటారు. 27వ తేదీన హైదరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు.
కాంగ్రెస్, బీజేపీలకు ధీటుగా సిఎం కేసీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రోజుకి మూడు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటూ తన పార్టీని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. మూడు పార్టీలు చాలా ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అయితే అన్ని పార్టీల సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కనుక ఈసారి మూడు పార్టీలలో దేనికెన్ని సీట్లు వస్తాయో తెలియాలంటే డిసెంబర్ 3న ఫలితాలు వెలువడేవరకు ఎదురు చూడాల్సిందే.