
రేపు ఆదివారం దీపావళి పండుగ. అయితే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు ఒకరోజు ముందే దీపావళి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో రేపు రాత్రి 10 గంటల తర్వాత ఎవరూ టపాసులు కాల్చరాదని కాలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేయగా వెంటనే బీజేపీ స్పందిస్తూ, “అది బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, రెండూ హిందువుల పండుగలపై ఎప్పుడూ ఆంక్షలు విధిస్తూనే ఉంటాయి. బిఆర్ఎస్ పార్టీని మార్చి బీజేపీని ఎన్నుకోవడానికి ఈ కారణం చాలు కదా?” అని ట్వీట్ చేసింది.
దానిపై బిఆర్ఎస్ వెంటనే స్పందిస్తూ, “ప్రతీదానిపై చిల్లర రాజకీయాలు చేయడం మానుకొంటే మంచిది. సుప్రీంకోర్టు స్వయంగా అన్ని రాష్ట్రాలకు ఈ ఆదేశాలు ఇచ్చింది. వాటినే అనుసరిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ రాత్రి 10 గంటల తర్వాత టపాసులు కాల్చడంపై నిషేదం విధించింది,” అంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని కూడా జత చేసింది.