
ప్రధాని నరేంద్రమోడీ శనివారం హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఎంఆర్పిఎస్ అధ్వర్యంలో జరుగబోయే మాదిగల విశ్వరూప మహాసభకు హాజరవుతారు. ఈ సభలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోడీ నిర్ధిష్ట ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రధాని పర్యటన సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్ళింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీస్ అదనపు కమీషనర్ జి.సుధీర్ బాబు తెలిపారు.
ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని సభలో పాల్గొంటారు. సాయంత్రం 6గంటలకు సభ ముగిసిన తర్వాత మళ్ళీ బేగంపేట నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.
మళ్ళీ ఈ నెల 25,26,27 తేదీలలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అప్పుడు మూడు రోజులు తెలంగాణలోనే బస చేసి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనబోతున్నారు. నవంబర్ 25వ తేదీన కరీంనగర్ జనగర్జన సభలో పాల్గొంటారు. 26వ తేదీన నిర్మల్ పట్టణంలో జరిగే జనగర్జన సభలో పాల్గొంటారు. 27వ తేదీన హైదరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ఎల్బీ నగర్ నుంచి శేరిలింగంపల్లి వరకు ప్రధాని నరేంద్రమోడీ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.