
మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతికి ఈసారి టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేసి నేడు సిఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఆమెకు టికెట్ ఇవ్వనందుకు ఆమె బాధపడలేదు. కానీ కాంగ్రెస్‌కు ద్రోహం చేసి బీజేపీలో మునుగోడు ఉపఎన్నికలలో కాంగ్రెస్ ఓటమికి కారకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, ఆయనకే మునుగోడు టికెట్ ఇచ్చినందుకు పాల్వాయి స్రవంతి ఎక్కువ బాధపడ్డారు. అందుకే ఆమె పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోబోతున్నారు.
ఈ మార్పులు చేర్పులు కారణంగా ఈసారి మునుగోడులో చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఉపఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలని ప్రచారం చేసిన ఆమె ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని గెలిపించి, కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని ప్రచారం చేయబోతున్నారు.
ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని వాదించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. కనుక తెలంగాణలో మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు చాలా అవసరమని వాదిస్తున్నారు.
ఉపఎన్నికలలో ఆయనని గెలిపించమని ప్రచారం చేసిన బీజేపీ నాయకులు, ఇప్పుడు ఆయనను ఓడించమని ప్రచారం చేస్తున్నారు.