నామినేషన్స్ దాఖలుకి చివరి రోజైన ఈరోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేశారు. ఆయనతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, షబ్బీర్ అలీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు. కేసీఆర్ అవినీతి పాలన నుంచి విముక్తి కోరుకొంటున్నారు. రైతులు, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతీ ఒక్కరూ తాము కేసీఆర్ చేతిలో మోసపోయామని భావిస్తున్నారు.
కేసీఆర్‌ని గద్దె దించాల్సిన సమయం వచ్చింది కనుకనే ఆయనకు మరో అవకాశం ఇవ్వకూడదనే నేను కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నాను తప్ప ఏదో సంచలనం సృష్టించాలని కాదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసమే నేను కేసీఆర్‌తో ముఖాముఖీ పోరాడేందుకు సిద్దపడుతున్నాను. కనుక కామారెడ్డి ప్రజలు మార్పు కోసం నాకు ఓటు వేసి తప్పక గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను,” అని అన్నారు.
రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తుండగా, సిఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో ఆయనపై ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ నెల 30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.