తెలంగాణ కాంగ్రెస్‌ హామీలకు అంతే లేదా?

తెలంగాణ కాంగ్రెస్‌ ఈసారి ఎన్నికలలో గెలిచి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చాలా పట్టుదలగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి కూడా దానికి అనుకూలంగా మారడంతో ఎట్టి పరిస్థితులలో ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదని గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆరు గ్యారెంటీ స్కీములు ప్రకటించింది. అవి తలకు మించిన భారమేనని, అమలుచేయడం చాలా కష్టమని పొరుగునే ఉన్న కర్ణాటకలో రుజువు అవుతోంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా కొత్త కొత్త హామీలు గుప్పిస్తూనే ఉంది.

ఈరోజు కామారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి బీసీ-డిక్లరేషన్ ప్రకటించారు. దానిలో ముదిరాజ్ వర్గాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రత్యేకంగా అనేక హామీలు గుప్పించారు. ఆ వివరాలు క్లుప్తంగా... 

1. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే బీసీల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాము. 

2. బీసీల సంక్షేమం కోసం రాబోయే 5 ఏళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తాము. 

3. బీసీ సబ్ ప్లాన్ అమలుచేస్తాము. 

4. అధికారలోకి వచ్చిన ఆరు నెలల్లోగా బీసీ రిజర్వేషన్లు పెంచుతాము. 

5. స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లు 23 నుండి 42కి పెంచుతాము. 

6. ప్రస్తుతం బీసీ-డీలో ఉన్న ముదిరాజ్ కులాన్ని బీసీ-ఏలోకి మారుస్తాము. 

7. బీసీ కార్పొరేషన్ ద్వారా ముదిరాజ్‌లకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు రుణం ఇప్పిస్తాము. 

8. ప్రతీ జిల్లాలో బీసీ భవన్, ప్రతీ మండలంలో బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేస్తాము.